కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. మళ్లీ అలా జరిగితే.. కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమా ?
తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది.
తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఆ ఎన్నికలతో నష్టపోతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అనేక మంది విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్,(Nagarjuna Sagar) హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచినా.. అదంతా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ వల్లే అనే వాదన ఉంది. ఈ ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని.. ఆ స్థానంలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇదిలా ఉంటే త్వరలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు(Munugodu) స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వస్తుందనే వాదన వినిపిస్తోంది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే నిజంగానే ఇక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నిజంగానే జరిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి ఉప ఎన్నిక అవుతుందనే విశ్లేషణులు వినిపిస్తున్నాయి.
మునుగోడులో సత్తా చాటాలని టీఆర్ఎస్, బీజేపీలు బలంగా ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగితే.. మరోసారి కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయే పరిస్థితి లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. అక్కడ 2018లో 30వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఉప ఎన్నికల్లో మాత్రం భారీగా నష్టపోయింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌నే ఎక్కువగా ఇబ్బందిపెట్టాయి. ఆ పార్టీలో ఊహించని విధంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నిక జరిగి.. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ తరహా ఫలితాన్ని చవిచూడాల్సి వస్తే.. అది రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారుతుందని.. మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరో పెద్ద సమస్యగా మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment