కారంచేడు దాడికి 37 ఏళ్లు

కారంచేడు స్మారక స్థూపం

కారంచేడు మారణకాండకు నేటితో 37 ఏళ్లు. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు.

హరిత విప్లవం సాగిన ప్రాంతాల్లో దాని వల్ల బలపడిన శూద్ర అగ్రకులాలు దళితుల మీద సాగించిన దాడిగా దీనికి సామాజిక క్రమంలో ప్రాధాన్యముందని విశ్లేషకులు భావిస్తారు.

తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు.. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది.

సాధారణంగా ఈ విషయంలో అంతగా చర్చలో ఉండని రాజకీయ నాయకుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు గత ఏడాది హఠాత్తుగా నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మరొక్కమారు అది చర్చకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో బీబీసీ తెలుగు కారంచేడు ఘటనతో ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులతో 2020 సంవత్సరంలో మాట్లాడింది.

"తగలబెట్టేద్దామని అనుకున్నారు"

"మాదిగల మీద కోపంగా ఉన్న కమ్మవారు పొద్దున్నే పల్లెమీదకు వస్తారని తెలుసు. వాళ్లొస్తే లేని పోని రచ్చ. మీరు కాలువకు పొండి అని మా అమ్మ నన్ను బట్టలుతకడానికి పంపించింది. అంత పెద్ద దాడి జరుగుతుందని అయితే అనుకోలే. అప్పటికే కాలువలో పల్లెకు సంబంధించి తెలిసిన వాళ్లు బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు. పనయ్యాక వాళ్లతో కలిసి తిరిగొస్తున్నాం. బడి, గుడి ఉన్న చోటుకు వచ్చేసరికి పెద్ద పెద్ద కేకలతో గుంపులుగా వస్తున్నారు. దీంతో, మళ్లీ కాలువ వైపు పరుగులు పెట్టాము. మా వాళ్లను ఎక్కడంటే అక్కడ తరుముతున్నారు. కొడుతున్నారు. మేం భయపడిపోయి చీరాల రోడ్డు వైపు పరిగెట్టాం"ఆ రోజు జరిగిన ఘటనను సులోచన ఇలా గుర్తుచేసుకున్నారు.

కారంచేడు దాడి బాధితురాళ్లలో సులోచన ఒకరు. ఆ మారణకాండలో భర్తను కోల్పోయిన స్త్రీ సులోచన. కారంచేడు గురించి కదిలిస్తే నిన్న మొన్నటి ఘటనలా భావోద్యేగంతో మాట్లాడారామె.

"ఆరుగురు ఆడవాళ్లం దొరికేశాం. మా చుట్టూ వచ్చి కర్రలతో కొట్టడం మొదలెట్టారు... వాళ్లు కొట్టిన దెబ్బలకు అంత ఎత్తు ఎగిరిపడుతున్నాం. అసలు బతుకుతామని కూడా అనుకోలేదు. ఈలోగా బరిసో..కర్రో తెలియదు. నా నుదుటి మీద తగిలింది. తర్వాత ఐదు కుట్లు పడ్డాయి. మాతో పాటు ఉన్న మరియమ్మని బళ్లెంతో పొడిచారు. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు. కానీ వాళ్ల దగ్గర అగ్గిపెట్టె కోసం వెదికినా దొరకలేదు. దాంతో మమ్మల్ని ఓ ఇద్దరికి అప్పగించి మిగిలిన వాళ్ల కోసం అంతా వెళ్లిపోయారు. వాళ్ల ఆడవాళ్లతో కొట్టించి.. మా పని పట్టాలని ఆదేశాలు ఇచ్చి అంతా పోయారు" అంటూ సులోచన నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.


సులోచన"

మమ్మల్ని కాలువ గట్టు వెంటా తీసుకుని వస్తుంటే.. తేళ్ల ముత్తయ్య చావు బతుకుల్లో కాలువలో కనిపించారు. ఆయ‌న్ను అప్పటికే కర్రలతో బాగా కొట్టారు. అవన్నీ చూసి.. 'వాడక్కడ చనిపోయాడు..వీడిక్కడ అయిపోయాడు'అని మాతో ఉన్న వాళ్ల మాటలు వింటుంటే వణుకుపుట్టింది. సాల్మన్ గాడు కూడా అయిపోయాడని వాళ్లు చెప్పుకుంటుంటే మా నాన్నకి ఏమయ్యిందోననే భయం వేసింది. మమ్మల్ని రాళ్లతో కొట్టి, కృష్ణ కాలువలో పడేయాలని అనుకుంటూ తీసుకొస్తున్నారు. తీరా చెరువు దగ్గరకు వచ్చే సరికి ఎదురుగా పోలీసులు కనిపించారు. దాంతో వాళ్ళు మమ్మల్ని వదిలేసి అటు పారిపోయారు. అప్పటికే మోషే తాతని కడుపులో పొడిచి పేగులు బయటకు లాగేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇంకా చాలామందిని కొట్టారు. అందరినీ రోడ్డు మీద పడుకోబెట్టారు. అది చూస్తేనే ఒళ్లు జలదరించింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు"అని వివరించారు సులోచన.

నాడు జరిగిన దాడిలో అప్పటికప్పుడు ఆరుగురు- దుడ్డు రమేష్, తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహేషువా, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహం మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల తర్వాత దుడ్డు అనీశమ్మని ఆమె ఇంటిలోనే చంపారు. మృతులు మొత్తం ఏడుగురయ్యారు.

ప్ర‌ధాన నిందితుడికి జీవిత ఖైదు

ఈ కేసులో సీబీసీఐడీ విచారణ జరిపింది. 9 సెక్షన్ల కింద 90 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ కూడా వేశారు. 80 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.

అయితే, ప్రధాన నిందితుడయిన దగ్గుబాటి చెంచురామయ్య సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తేళ్ల జడ్సన్ ప్రైవేట్ పిటీషన్ వేశారు. ఈ కేసు తొలుత చీరాల మునిసిబ్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలయ్యింది. ఈకేసులో 140 మందిని నిందితులుగా పేర్కొన్నారు. బొజ్జా తారకం, మట్టే వెంకట సుబ్బయ్య వంటి వారు న్యాయవాదులుగా పిటీషనర్ తరపున పనిచేశారు. ఆ తర్వాత కేసు పర్చూరుకి బదిలీ చేయడం పట్ల అభ్యంతరాలు రావడంతో చివరకు గుంటూరు కోర్టుకి బదిలీ చేశారు.

అక్టోబర్ 30, 1994నాడు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదుగురికి యావజ్జీవ కారాగారశిక్ష, 65 ఏళ్ల వయసు పైబడిన నలుగురు వృద్ధ నేరస్థలకు 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. 46 మందికి 3 ఏళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షపడిన వారంతా హైకోర్టులో పిటీషన్ వేశారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1998 జూలై 24న ఇచ్చిన తీర్పులో కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ తేళ్ల జడ్సన్ వంటి వారు పట్టుదలతో ప్రయత్నం చేసి చివరకు 1998 లో సుప్రీంకోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. సరిగ్గా పదేళ్లకు అంటే 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు అంజయ్యకు జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

జీవిత ఖైదు పడిన అంజయ్య కుటుంబీకులతో మాట్లాడేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని అంజయ్య సమీప బంధువుతో మాట్లాడింది.

"అది ఆరోజు ఆవేశంలో జరిగిన తప్పు... అందులో ఉద్దేశ్యపూర్వకమైనది ఏమీ లేదు. దాని ఫలితం కారంచేడు చాలాకాలం అనుభవించాల్సి వచ్చింది. దాన్నొక పీడకలగా మర్చిపోయి గ్రామాభివృద్ధిలో అందరూ భాగం కావాలి" ఆయన అన్నారు.

కారంచేడు ఘటన జరిగిన నాటినుంచి తీర్పు వచ్చే వరకు చాలా పరిణామాలు జరిగాయి. బాధితుల తరపున అటు ప్రజాసంఘాల్లోనూ ఇటు అధికార వర్గంలోనూ బాసటగా నిలిచిన వారున్నారు. ముఖ్యంగా ఘటన తర్వాత జరిగిన ఆందోళన ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రలో ఒకానొక కీలక ఘట్టం. దాదాపు ఆరు నెలలపాటు ఆందోళన కొనసాగింది. దీని నుంచే కత్తి పద్మారావు, బొజ్జా తారకం తదితరుల నేతృత్వంలో దళిత మహాసభ అనే సంస్థ ఊపిరి పోసుకుంది.


కత్తి పద్మారావు

"వెంటాడి వేటాడారు"

"జూలై 17 నాటి దాడికి ముందే గ్రామంలో మాలలపై దాడి జరిగింది. దాంతో వారు చీరాల వెళ్లిపోయారు. ఎరుకల మీద దాడి చేశారు. వారు కూడా ఊరు వదిలిపోయారు. ఇక మిగిలింది మాదిగలు. వారిని చాలా సార్లు వేధించారు. చివరకు క్రిస్మస్ నాడు కొత్త బట్టలు కట్టుకుంటే కూడా సహించలేకపోయారు. అన్నింటికీ పరాకాష్ఠ‌గా జూలై 17 నాడు చెరువు గట్టున మున్నంగి సువార్తమ్మ, వికలాంగుడైన చంద్రయ్య తాగునీటి చెరువులో వ్యర్థాలను కలపడాన్ని ప్రశ్నించడం సహించలేకపోయారు. చెర్నకోల్ దాడిని బిందె అడ్డుపెట్టి సువార్తమ్మ అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి వియ్యంకుడి ఊరిలోనూ మాదిగలు ఎదురుతిరుగుతున్నారని తల్లడిల్లిపోయారు. దాంతో నాలుగైదు గ్రామాల వాళ్లు కలిసి దగ్గుబాటి చెంచురామయ్య ఇంట్లో మీటింగ్ పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా దాడి చేశారు. కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్లు సహా మారణాయుధాలు పట్టుకుని తెగబడ్డారు. వెంటాడి వేటాడారు. ఒక్కొక్కరి ఒంట్లో 140 పోట్లు కూడా పొడిచారంటే ఎంత దుర్మార్గమో ఆలోచించండి" అంటూ వివరించారు నాటి ఉద్యమ నాయకులు కత్తి పద్మారావు.

"ఆరోజు చీరాలలో మిత్రుడితో కలిసి ఉన్నప్పుడు సమాచారం వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి చూస్తే ఒక్కొక్కరి పరిస్థితి కొన ఊపిరితో ఉన్నారు. అప్పటికప్పుడే కొందరిని గుంటూరు తరలించాము. అక్కడే ఉండి శిబిరం ఏర్పాటు చేశాము. అందరితో చర్చించి ఉద్యమానికి సిద్ధపడ్డాం. దాంతో చెంచురామయ్య మీద కేసు పెట్టించారనే కక్షతో నన్ను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఉద్యోగం పోయింది. ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. మా అవిడని, పిల్లలను, తల్లిని కూడా బాధపెట్టారు. అయినప్పటికీ ఆత్మగౌరవ పోరాటం ఆపలేదు. అనేక మంది కలిసి వచ్చారు. అందులో బాధితులు ధైర్యంగా నిలబడడం కీలకం. ఆమరణ దీక్షకు పూనుకున్న తేళ్ల జడ్సన్ వంటి వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అనేక సామాజిక పోరాటాలకు కారంచేడు స్ఫూర్తిగా నిలిచింది. ప్రభుత్వ నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా 15 ఎకరాల భూమి కొని బాధితులకు అందించాం. దాని కొనుగోలులో అనేక మంది చేయూత అందించారు. చివరకు ప్రభుత్వం సంపూర్ణ ప్యాకేజీ అందించే వరకూ పోరాడి సాధించాం. ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా రూపొందించుకోగలిగాం" అని పద్మారావు చెప్పారు.


ఎస్.భగత్ సింగ్, కారంచేడు ఉద్యమకారుడు

కారంచేడు మాదిగపల్లె మీద జరిగిన దాడితో తమ ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలని వారు భావించినప్పటికీ ఆ చర్య కారణంగానే అనేకమందిలో పోరాట స్ఫూర్తికి కారణం అయ్యిందని నాటి పోరాటంలో భాగస్వామిగా ఉన్న భగత్ సింగ్ వ్యాఖ్యానించారు.

"జూలై 16 నాడు మాదిగ కుంట వద్ద జరిగిన తగాదా కారణంగానే దాడికి పాల్పడినట్టు చెబుతున్నప్పటికీ దానికన్నా ముందు నుంచే మాదిగ యువతలో వస్తున్న చైతన్యం స్థానిక పెత్తందార్లకు రుచించలేదు. మూకుమ్మడి దాడికి కాల్పడ్డారు. దాంతో మానవత్వం ఉన్న వారందరినీ కలచివేసింది. కుల, మతాలకు అతీతంగా అంతా ఒక్కటై కదిలారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం కలిసి వచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు అన్ని వర్గాలు ఒక్కటయ్యాయి. మొదటి రోజు కత్తి పద్మారావు చీరాలలో ఉండడంతో సమాచారం అందుకున్నారు. ఆ మరుసటి రోజే ఇద్దరం కలిసి ఉదయాన్నే చీరాల చేరుకున్నాం. అప్పుడు మొదలయిన ఉద్యమం ఆరు నెలలు సాగింది. డిసెంబర్లో ప్రభుత్వం హామీలన్నీ అమలు చేసే వరకూ పోరాటంలో అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకెళ్లాం. చివరకు శిబిరం పేరుతో అనేక మంది సహాయంతో ఏర్పాటు అయిన బాధితుల కాలనీ విజయనగర్ కాలనీగా రూపాంతరం చెందేవరకూ ఉద్యమం ఆగలేదు."

తేళ్ల జడ్సన్, న్యాయపోరాటం చేసిన కారంచేడు బాధితుడు


23 ఏ‌ళ్ల సుదీర్ఘ పోరాటం

"న్యాయ పోరాటంలో చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాం. నన్ను అడుగడుగునా అవమానించారు. వాటిని భరిస్తూ ముందుకెళ్లాం. కత్తి పద్మారావు, బత్తుల పుల్లయ్య, బొజ్జా తారకం వంటి వారు ముందుండి నడిపించారు. వారందరి సహకారం వల్లే చివరకు సుప్రీంకోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయగలిగాం. ఈ న్యాయపోరాటంలో అనేక మంది సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు" అంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసినటువంటి జడ్సన్ వ్యాఖ్యానించారు.

జడ్సన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. విజయనగరం కాలనీలోని తన ఇంట్లో ఉన్న ఆయన్ని బీబీసీ కలిసినప్పుడు మాట్లాడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించి కొద్ది మాటలు మాత్రం చెప్పగలిగారు. న్యాయం జరగడానికి 23 ఏళ్ల పాటు కోర్టుల్లోనూ బయటా సుదీర్ఘ పోరాటం జరపాల్సివచ్చింది"అని జెడ్సన్ చెప్పారు.

"ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిరావడానికి మహిళల పోరాటమే మూలం... జూలై 17 నాటి ఘటనల తర్వాత వరుసగా ఉద్యమాల వేడి రాజుకుంది. ఘటనపై దేశమంతా ఆందోళనలు మిన్నంటాయి. వివిధ సంఘాలు ఐక్యంగా ఉద్యమాలకు దిగారు. అందులో భాగంగా దళిత మహాసభను ఏర్పాటు చేశారు. కత్తి పద్మారావు నేతృత్వంలో ఏర్పడిన ఐక్య పోరాట కూటమిలో వివిధ సంఘాలు భాగస్వాములయ్యారు.

చీరాలలో సెప్టెంబర్ 1న చీరాలలో జరిగిన బహిరంగ సభతో మరింత ఉద్ధృతమయ్యింది. సెప్టెంబర్ 10న బంద్ కూడా జరిగింది. మధ్యలో రాస్తారోకోలు, రైల్ రోకోలు వంటి రూపాల్లో నిరసనలు సాగించారు. అక్టోబర్ 6న విజయవాడలో బహిరంగసభ జరుగుతుండగా లాఠీచార్జ్ కూడా జరిగింది. సభలో ప్రసంగిస్తుండగా కత్తి పద్మారావుని వ్యాస్ సారధ్యంలోని పోలీసులు అరెస్ట్ చేసి, అడ్డుకున్న అనేక మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ కి చేశారు.

హేతువాద లక్ష్మి

చీరాల టు అబిడ్స్

ఆ తర్వాత అక్టోబర్ 27న మహిళలు హైదరాబాద్ కేంద్రంగా సాగించిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నాటి సీఎం ఎన్టీఆర్ ఇంటిని ముట్టడించి, ఆయన బయటకు వచ్చి నిరసనకారుల డిమాండ్లపై స్పందించే వరకూ కదిలేది లేదంటూ 600 మంది మహిళలు బైఠాయించడం పెద్ద సంచలనంగా మారింది"అని ఈ నిరసనకు నాయకత్వం వహించిన హేతువాద లక్ష్మి బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

"కారంచేడు ఘటన ఎంతో కలచివేసింది. దాంతో భీమవరం ఇంట్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తల్లో విని, ఏదోటి చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటికప్పుడే సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి అర్థరాత్రి చీరాల చేరుకున్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి బాధితులను చూసిన తర్వాత వారికి తోడుగా ఉండాలనే నిర్ణయించుకున్నాను. కట్టుబట్టలతో వెళ్లి ఆరు నెలల పాటు వారితోనే ఉండిపోయాను. అన్ని పోరాటాల్లోనూ పాల్గొన్నాను. విజయవాడ సభలో లాఠీఛార్జ్ తర్వాత ఇక హైదరాబాద్‌లో నేరుగా ముఖ్యమంత్రిని నిలదీయాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే విజయవాడలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ మహిళలు మాత్రం ముందుకు కదిలారు. వారి చైతన్య స్ఫూర్తితో నేరుగా అసెంబ్లీ వద్ద సీఎంని అడ్డుకోవాలని అనుకున్నప్పటికీ సమాచారం అందుకుని సీఎం ఎన్టీఆర్ అబిడ్స్ లోని తన ఇంటికే వెళ్లిపోయారు. దాంతో మేము కూడా అక్కడికే వెళ్లి ఇంటి ముందు బైఠాయించాము. గంటల కొద్దీ గడుస్తోంది. పోలీసులు మమ్మల్ని బెదిరించినా వెనక్కి తగ్గలేదు. చివరకు సీఎంతో చర్చల కోసం అంటూ బొజ్జా తారకం సహా కొందరు మహిళలను ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపల కాదు..బయట ప్రజల్లోకి రావాలని పట్టుబట్టి ఆయన రోడ్డు మీదకు వచ్చేలా చేశాం. రెండు గంటల పాటు ఘెరావ్ చేసి 28 డిమాండ్లకు ఆయన అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసేలా చేశాం. చివరకు ఎస్ ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో హామీలన్నీ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పెట్టిన డిమాండ్ కూడా ఎన్టీఆర్ అంగీకరించాల్సి వచ్చింది" అంటూ లక్ష్మి వివరించారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు

ఎన్టీఆర్ వియ్యంకుడు కాబట్టే మా నాన్నను చంపారు..

ఆగ్రహంతో కొందరు దుశ్చర్యకు పాల్పడితే రాజకీయంగా ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన వియ్యంకుడిగా తన తండ్రిని హత్య చేశారని కారంచేడు నుంచి రాజకీయంగా ఎదిగి, ఆనాడు రాష్ట్ర మంత్రిగా కీలకనేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు. కారంచేడు పరిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

"గేదెలకు కుడితి పెడుతున్న సమయంలో వచ్చిన చిన్న తగాదా చినికి చినికి గాలివానలా మారింది. జూలై 17 ఉదయం 10 గంటలకు మా నాన్న హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చారు. ఊర్లో చాలామంది వస్తే అలాంటి పనులు తప్పు అని మా నాన్న చెప్పారు. నేను కలుగజేసుకునేది లేదు అని కూడా చెప్పారు. అయినా పీపుల్స్ వార్ రాజకీయ ప్రయోజనాల కోసం తాము బలపడేందుకు ఎన్టీఆర్ వియ్యంకుడైన మా నాన్న మీద గురిపెట్టారు. కోస్తాలో అప్పటికే అందరికీ పరిచితుడిగా ఉన్న దగ్గుబాటి చెంచురామయ్యను హత్య చేస్తే ఎస్సీ కులస్తులంతా తమ వైపు వస్తారని, తాము బలపడతామని పీపుల్స్ వార్ ఆశించింది. అందుకే ఐదుగురిని పంపించి మా నాన్నను హత్య చేశారు. సంఘటనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా అకారణంగా ఆయన బలయ్యారు. నిజానికి జూలై 17 ఘటనకు ముందు మా గ్రామంలో ఎటువంటి తగాదాలు లేవు. అంతా కలిసి మెలిసి సాగే క్రమంలో ఆవేశకావేశాలతోనే రెచ్చిపోవడంతో ప్రాణాలు పోయే వరకూ వచ్చింది" అంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు.

దగ్గుబాటి చెంచురామయ్య 1989లో హత్యకు గురయ్యారు. తామే హత్య చేసినట్టు, కారంచేడు ఘటనకు బాధ్యుడిగా, ఆ దాడికి ప్రతీకారంగా హత్య చేసినట్టు పీపుల్స్ వార్ ప్రకటించింది. ఈ కేసులో ఐదుగురికి మరణి శిక్ష విధిస్తూ 1994లోనే గుంటూరు సెషన్స్ కోర్ట్ తీర్పు చెప్పింది. ఆ తర్వాత కొందరికి క్షమాభిక్ష లభించింది.

కారంచేడు ఘటన తర్వాత సాగిన ఉద్యమం కులం అనే అంశాన్ని అటు ఉద్యమాల్లోనూ ఇటు పాలనలోనూ ఎజెండాలోకి బలంగా తెచ్చిందని యాక్టివిస్టు బొక్కా పరంజ్యోతి అభిప్రాయపడ్డారు. కారంచేడు శిబిరానికి ఆయన గృహం అప్పట్లో కొంతకాలం కేంద్రంగా పనిచేసింది.

దుడ్డు యేలేశమ్మ, డానీ (1985 ఆగస్ట్ 15)

మీడియా సహకారం

బాధితులు కులం, మతం వంటి విబేధాలను పక్కనపెట్టి ఒక్కటిగా ముందుకు కదిలితే ఉద్యమాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయన్నది కారంచేడు నిరూపించిందని సీనియర్ జర్నలిస్ట్, నాటి ఉద్యమ నాయకత్వంలో ముఖ్య పాత్ర పోషించిన ఉష ఎస్ డానీ పేర్కొన్నారు.

"ఈ భూమ్మీద ఏ బీమా కంపెనీ ఇవ్వనంత డివిడెండ్‍ ను సమిష్ఠిగా ఉద్యమాలు ఇస్తాయి. కాకపోతే కొంచెం సహనం కావాలి. కారంచేడు, తదితర ఉద్యమాల్లో పాల్గొనడానికి నాకో ఉత్తేజం, ప్రయోజనం వున్నాయి. నా సామాజిక వర్గం అణగారిన వర్గం. దానికి కష్టం వచ్చినపుడు ఇతర అణగారిన వర్గాలు సంఘీభావాన్ని తెలుపుతాయనే నమ్మకం నాకుండింది. అది ఇప్పుడూ వుంది"అని బీబీసీ తెలుగుతో అన్నారు.

ఉదయం దిన పత్రిక (జూలై 1985)

"కారంచేడు ఉద్యమానికి మీడియా సపోర్టు చాలా వుంది. అప్పట్లో ఉదయం దినపత్రిక వెలుగులో వుంది. ఉద్యమ అభిమానులు చాలామంది ఉదయం, ఆంధ్రప్రభ దినపత్రికల్లో అనేక కీలక స్థానాల్లో వున్నారు. వీరిలో కే శ్రీనివాస్, వేమన వసంతలక్మి, బుధ్ధా జగన్ వంటి వారు ముఖ్యులు.

ఉదయం ఎడిటర్‌గా ఏబికే ప్రసాద్ వున్నారు. ఆయన తొలిరోజే ‘కారంచేడు కండకావరం’ అనే ఎడిటోరియల్ రాశారు. ఇవన్నీ ఉద్యమానికి కలిసివచ్చాయి. ప్రాంతీయ, జాతీయ పత్రికలు బాగా కవరేజి ఇచ్చాయి. మరోవైపు ప్రభుత్వం, పోలీసులు కూడా సెప్టెంబరు 10 వరకు మౌనంగా ఉండడంతో ఉద్యమం తీవ్రం అయ్యింది"అంటూ నాటి పరిణామాలను డానీ వివరించారు.

రుధిర క్షేత్రం పేరుతో మృతుల సమాధులు

బాధితులకు న్యాయం జరిగేందుకు శంకరన్ కృషి

హైదరాబాద్ లో సీఎం ఇంటిని మహిళలు ముట్టడించిన సమయంలో ఇచ్చిన పునరావాస ప్యాకేజీ అమలు బాధ్యతను సీనియర్ అధికారి ఎస్. ఆర్ శంకరన్‌కు అప్పగించారు.

ఆయన ఆధ్వర్యంలోనే 1986 ఫిబ్రవరి 16న చీరాల ఐఎల్ టీడీని ఆనుకుని విజయనగర్ కాలనీకి శంకుస్థాపన జరిగింది.

ఇక బాధిత కుటుంబాల్లో ఆర్హులకు ఉద్యోగాలు, రెండు ఎకరాల భూమి, అందరికీ ఇళ్ల నిర్మాణం, ఉపాధి కోసం స్వయం కృషి సంస్థ ఏర్పాటు వంటి హామీలన్నీ అమలులో శంకరన్ బృందం చొరవ బాధితులకు ఉపయోగపడింది.

courtesy bbc news


Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....